కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. వర్క్‌ ఫ్రం హోమ్‌

 కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధుల వేళల్లో కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రూప్‌ బి, గ్రూప్‌ సి వర్గాల ఉద్యోగుల్లో సగం మంది కార్యాలయాలకు వచ్చి పని చేయాలని సూచించింది. ఇక ఇదే వర్గంలోని మిగతా 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయనున్నారు. 


అయితే ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించి, నిర్ణీత సమయాల్లో వచ్చి వెళ్లేలా నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని హెచ్‌వోడీలకు కేంద్రం సూచన చేసింది. ఈ పని వేళలు మార్చి 20వ తేదీ నుంచే వర్తించనున్నాయి. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఈ పని వేళలు కొనసాగనున్నాయి. కార్యాలయాలకు వచ్చి పని చేసే ఉద్యోగులకు మూడు రకాల స్లాట్స్‌ను కేటాయించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు, ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు విధులు నిర్వహించనున్నారు.